టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి.
టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యాలయం లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు.. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
‘ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి. ప్రశ్నాపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి.’ అని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.