సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ సత్తా చాటింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై దాదాపు 2 వేల ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందినట్లు తెలిసింది. అయితే అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మొత్తం 11 ఏరియాలు ఉండగా 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని సంఘం తన ఉనికిని కోల్పోయింది.
బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ గెలుపొందింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ విజయకేతనం ఎగురవేసింది. గెలిచిన అభ్యర్థులకు మద్దతుగా కార్మికులు సంబరాలు చేసుకున్నారు. విజయానికి మద్దతు పలికిన కార్మికులకు విజేతలు ధన్యావాదాలు తెలిపారు. కార్మిక సంఘ నేతలు, కార్మికులు బాణసంచా కాల్చుతూ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.