తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనతో పాటు మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. సీఎం కాకుండా 17 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 8 మంది మాత్రమే ప్రమాణం చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనతో కాకుండా పూర్తిస్థాయి మంత్రివర్గంతోనే వెళ్లమని అధిష్ఠానం ఏఐసీసీ నేతలు, రేవంత్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు మినహా మంత్రుల జాబితా గవర్నర్ కార్యాలయానికి చేరకపోవడం గమనార్హం.
ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేదా ఆయన సతీమణి పద్మావతి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి మెదక్ నుంచి దామోదర రాజనర్సింహా, నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్ లేదా వినోద్, ప్రేమసాగర్ రావుల పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీధర్‌బాబుకు ఆర్థికశాఖ, భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ, డిప్యూటీ సీఎం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నీటిపారుదల శాఖ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.