హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ట్రైనీ ఐపీఎస్‌ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం టాపర్‌గా నిలిచిన కాలియాకు బహుమతి ప్రదానం చేశారు. 175 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 14 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారు.
వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయని ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు. క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థికవ్యవస్థ బలహీనానికి యత్నిస్తున్నారని తెలిపారు. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్టంగా పోరాడాలని.. శిక్షణ పూర్తైన ఐపీఎస్‌లు ఈ సమస్యలపై పోరాడుతారనే నమ్మకం ఉందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
పరేడ్ ముగిసిన తర్వాత అమిత్ షా సూర్యాపేటలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో సూర్యాపేటకు బయల్దేరతారు. సాయంత్రం 4 గంటలకు జరిగే బీజేపీ జనగర్జన సభకు అమిత్‌షా హాజరవుతారు. సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుని ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. జనగర్జనసభకు బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వర్ రావు సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభలో 40 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.