తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాయి. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రచారంలోనూ జోష్ పెంచాయి. ముఖ్యంగా బీజేపీ ప్రజాహిత యాత్ర, విజయ సంకల్ప యాత్రలతో ఎన్నికల బరిలోకి ముందుగానే దిగింది. ఈ యాత్రల్లో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు రాష్ట్రంలో ప్రచారం కూడా నిర్వహించారు.
ఇక తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 12వ తేదీన తెలంగాణకు రానున్న ఆయన బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలకు లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. 17 ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు సూచిస్తారు.
ఇక ఇటీవలే ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ కూడా రాష్ట్రానికి వచ్చారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభల్లో పాల్గొన్నారు.