తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా.. వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

-

ప్రజా ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా  వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి  వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి  ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలోనూ ప్రకటించారు.  ఇటీవల హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహింద్రా సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై చర్చలు జరిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ది కానున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బ్యాగరికంచె వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 01న శంకుస్థాపన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version