తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. ప్రముఖ నగరాలను కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేస్తోంది. ఈ రైలు పట్టాలెక్కేందుకు తాజాగా ముహూర్తం కూడా ఖరారైంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలు (నం.20707/20708) మార్చి 12వ తేదీన ప్రారంభం కానుంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఈ రైలు గురువారం మినహా మిగతా రోజుల్లో సర్వీసు అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. రెగ్యులర్ సర్వీసులు మార్చి 13 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. బుకింగ్‌లు మార్చి 12వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ రైలు (20707) ఉదయం 5.05గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని వివరించారు. మళ్లీ అదే రోజు విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరిన (20708) రాత్రి 11.20గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని చెప్పారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనుంది.