తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. రూ.1400 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని గుర్తు చేసింది.
ఆరోగ్య శ్రీ తో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవలకు ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని.. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రాష్ట్రంలో 471 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు సమాచారం. 2023 డిసెంబర్ 08వ తేదీ వరకు రూ.723.97 కోట్ల మేర బకాయిలు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతినెల సగటును రూ.100 కోట్ల వరకు చెల్లింపులు చేస్తూ వస్తున్నట్టు ఆరోగ్య శాఖ చెబుతోంది.