తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మొక్కలతో అలంకరిస్తున్నారు.
జూన్ 2వ తేదీన ఉదయం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్ బండ్‌పై దశాబ్ది అవతరణ దినోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవనున్నారు.
ఇక ట్యాంక్ బండ్పై జరగనున్న కార్యక్రమాల్లో స్పెషల్ అట్రాక్షన్గా.. రాష్ట్ర అధికారిక గీతం జయజయహే తెలంగాణ ఆవిష్కరణ నిలవనుంది. ‘‘జయజయహే తెలంగాణ’’పై పోలీసు సిబ్బంది ప్రదర్శన చేపట్టనున్నారు. ఉత్సవాలకు పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రతువులో రహదారులు, భవనాలు, బల్దియా, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్తు, పర్యాటక, సమాచార, అగ్నిమాపక, పోలీసు తదితర శాఖలు నిమగ్నమయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయి.