దిల్లీ ఆర్డినెన్స్‌కు లోక్ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. దిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కోసం అటల్‌బిహారీ వాజ్‌పేయీ ఈ సభలో బిల్లును ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ద్వారా గౌరవసభ హోదాను ఈ ప్రభుత్వం కించపరుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా.. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబయి కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ)గా మారే రోజులు ఎంతో దూరంలో లేవని అన్ని ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని ఒవైసీ అన్నారు. ‘మీ రాజకీయ పోరాటాన్ని (బీజేపీ, ఆప్) సభ వెలుపల చూసుకోండి’ అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల థింక్ ట్యాంక్ నుంచే బయటకు వచ్చారని అన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వ మనిషేనని, మీరు అధికారంలో లేనప్పుడు ఆయనను ఆ స్థానంలో ఉంచాలనుకుంటున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.