తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు భారత్ రాష్ట్ర సమితి కీలక అడుగు వేయనుంది. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంతో పాటు అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులని బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేసిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్కాజిగిరితో పాటు గతంలో ప్రకటించని జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు.
మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఐతే గతంలో ప్రకటించిన 114 మంది అభ్యర్థుల్లో ఇద్దరు, ముగ్గురిని మార్చవచ్చునని ప్రచారం సాగుతోంది. బీ ఫారాల పంపిణీతో పాటు ఎన్నికలపై అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా మేనిఫెస్టోను వివరించాలని కేసీఆర్ సూచించనున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో .. నామినేషన్, అఫిడవిట్ల దాఖలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు కేసీఆర్ వివరించనున్నారు.