మందాడి సత్యనారాయణ రెడ్డి మరణంపట్ల బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి చేశారు. ఈ నేపథ్యంలోనే వారి కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి సంతాపం తెలిపిన బండి సంజయ్.. బీజేపీ బలోపేతానికి మందాడి ఎంతగానో కృషి చేశారని వెల్లడించారు. మారుమూల పల్లెలో ( గ్రామం ఇప్పగూడ, మండలం స్టేషన్ ఘనపూర్, జిల్లా జనగామ ) జన్మించిన మందాడి సత్యనారాయణరెడ్డి జనసంఘ్ లో క్రియాశీలకంగా పనిచేశారు. బీజేపీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీ మందాడి సత్యనారాయణరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో శ్రీ మందాడి సత్యనారాయణరెడ్డి క్రియాశీల పాత్ర పోషించారు. శాసనసభ్యుడిగా కొనసాగిన సమయంలో స్వరాష్ట్ర సాధన కోసం అసెంబ్లీలో తనదైన శైలిలో గళం విన్పించారని వెల్లడించారు. స్వతహాగా గాయకుడు, రచయిత, కవి అయిన శ్రీ మందాడి సత్యానారాయణ అసెంబ్లీ వేదికగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సామాన్య ప్రజలకు అర్ధమయ్యేలా పాటల రూపంలో విన్పిస్తూ సభను ఆకట్టుకునే వారు. శ్రీ మందాడి సత్యనారాయణ మరణం కుటుంబ సభ్యులకు, పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు బండి సంజయ్.