తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా బీజేపీ.. గత బీఆర్ఎస్ వైఫల్యాలను.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో దూసుకెళ్తోంది. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. మరోసారి గెలిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఇఁదులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో ప్రచారం చేపట్టిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో తరుగు తీస్తున్నారని, క్వింటాకు ఆరు నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని తెలిపారు. తరుగు లేకుండా ధాన్యం కొంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీ.. హామీగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కార్కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదని విమర్శించారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నారన్న సంజయ్.. డబ్బులు లేకుండా ప్రభుత్వం రుణమాఫీ ఎలా చేస్తుందని నిలదీశారు.