భట్టి ఛైర్మన్ గా రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

-

రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. గత నెల 22వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో జారీ చేశారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రైతు భరోసా పథకానికి అర్హతలు, విధివిధానాలు, మార్గదర్శకాలను… మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది. కమిటీ సిఫార్సులపై ఈనెలాఖరులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

రైతు భరోసా పథకం అమలు విధివిధానాల రూపకల్పనలో భాగంగా ఎన్ని ఎకరాల వారికి దానిని అమలు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. నిర్ణీత నమూనాలో 5 ఎకరాల లోపు, 8 ఎకరాల లోపు, పదెకరాల లోపు, 15, 20, 30 ఎకరాల లోపు… ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని వ్యవసాయ శాఖకు సూచించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ సమాచారాన్ని వ్యవసాయాధికారులు సేకరించారు. మరో రెండు రోజుల పాటు ఇది జరగనుంది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version