తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 15 ఏళ్లు గులాబీ పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని పేర్కొన్నారు.
మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని దీంతో మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ జడ్పీ ఛైర్‌పర్సన్లతో మంగళవారం రోజున ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ సన్మానించి కుటుంబ సభ్యులతో వచ్చిన జడ్పీ ఛైర్‌పర్సన్లతో కలిసి ఫొటోలు దిగారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. “తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీ ఫాం దక్కితే వాళ్లదే విజయం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కొంచెం కష్టపడితే మనకే మంచి ఫలితాలు వస్తాయి. పార్టీలో అన్ని స్థాయుల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తాం. సోషల్ మీడియా విభాగాన్ని పటిష్ఠంగా తయారు చేస్తాం.” అని అన్నారు.