రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేల ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వం పై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా.. శనివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లిలో తుమ్మల తో ఆయన సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం భట్టి మాట్లాడుతూ.. తుమ్మల విలువలు కలిగిన రాజకీయ నేత అని.. ఆయన ప్రజా జీవితంలో ఉండి ప్రజల కోసం నిరంతరం తపిస్తారని కొనియాడారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఇక మరోవైపు ఈ నెల 6న తుమ్మల కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది.