తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండి పడ్డారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్‌సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం సరికాదు అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో భారతదేశంలో వ్యవస్థలు కొనసాగుతున్నాయని ఆ రాజ్యాంగం ప్రకారమే.. ప్రభుత్వాలు నడుస్తున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో బడ్జెట్ సందర్భంగా గవర్నర్ మాట్లాడే అంశాన్ని పూర్తిగా రద్దు చేయడం సరికాదు అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అన్నారు.
ఇప్పటివరకు దేశంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రభుత్వాలను, అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీలు ముఖ్యం కాదు.. వ్యవస్థ ముఖ్యంగా పరిపాలన సాగుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగానికి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయని ఇటువంటి రాజ్యాంగానికి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయని రాజ్యాంగం చేసిన చట్టాలను తుంగలో తొక్కడం సరికాదు అన్నారు.
శాసనసభలో గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైందని కేసీఆర్ గుర్తించాలన్నారు. శాసనసభ వ్యవహారాల్లో ఇలాంటి పోకడలు మంచివి కావన్నారు. ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఈ యాత్ర సాగుతున్నా.. మధిర నియోజకవర్గం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు భట్టి.