తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాలకు శుక్రవారం నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులకు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. జిల్లాల వారీగా పోస్టులతో కూడిన సమగ్ర ప్రకటనతో పాటు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
గ్రూప్-4 ఉద్యోగాలకు ఈనెల 23 నుంచి 2023 జనవరి 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు మూడు వారాల గడువు ఇచ్చింది. పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. గ్రూప్-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలక శాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పూరపాలక శాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా, వీటిలో సీసీఎల్ఏ పరిధిలో 1,294 ఉన్నాయి.