తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు సిద్ధం చేస్తోంది. పోలింగ్ సిబ్బంది డేటాను రెడీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నెలలో నమోదు అయిన రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ ఇతర సిబ్బంది వివరాలను పరిశీలించాలని సూచించింది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం, పంచాయతీలు, వార్డుల సంఖ్య ఆధారంగా వివరాలు ఉండాలని స్పష్టం చేసింది.

కాగా, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ తేదీ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5,817 నుంచి 5,773కి తగ్గింది. 71 గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడమే దీనికి గల ప్రధాన కారణం. తాజాగా ఇంద్రేశం, జిన్నారం, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఈ సంఖ్య మరింతగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రామపంచాయతీలు 12,760 కానుండగా వార్డుల సంఖ్య 1,12,500కు చేరింది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల సంఖ్య 56గా ఉండగా… జిల్లా పరిషత్ ల సంఖ్య 31గా ఉన్నాయి.