క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ మహానగరం అడ్డాగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏదైనా రాజకీయ అనిశ్చితి ఏర్పడితే ఏఐసీసీ భాగ్యనగరాన్ని సురక్షిత ప్రాంతంగా ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇక వారు వెళ్లగానే తాజాగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాగ్యనగరంలో దిగారు.
మూడు రోజులుగా హైదరాబాద్ శివారు రిసార్టులో ఉన్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లారు. ఝార్ఖండ్ శాసనసభ్యులు వెళ్లగానే బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వచ్చిన విమానం శంషాబాద్‌లో వాలిపోయింది. ఈనెల 12వ తేదీన నీతీశ్ సర్కార్‌కు బలనిరూపణ ఉన్నందున 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వారిని తొడ్కొని స్థానికంగా ఉన్న రిసార్ట్‌లో బస ఏర్పాటుచేశారు. ఇతరులెవరూ వారిని కలవకుండా కాంగ్రెస్ నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బీజేపీ, జేడీయూ సర్కార్ బిహార్ ఎమ్మెల్యేలను వారి పక్షంలోకి లాగేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నందనే.. కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమై హైదరాబాద్‌కు పంపినట్లు సమాచారం.