2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్ తో పాటు ఆయన గతంలో ఎంపీగా గెలిచిన మల్కాజ్ గిరిలోనూ బీజేపీ సత్తా చాటింది. మరో 6-7 సీట్లలో రెండోస్థానంలో ఉన్నాం. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కి బలమైన మెదక్ లో కూడా బీజేపీ గెలుపొందింది అని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చినటుంటి హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు.
తెలంగాణలో ఉచిత బస్సు మినహా ఏ హామీ కూడా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో 8, లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలిచామని వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు మోడీ నాయకత్వాన్ని విశ్వసించారని అన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ కావడం వల్లే బీజేపీ గెలిచిందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటమి బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలే నిజమైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన అనేక సెట్మెంట్లలో కాంగ్రెస్ కు మెజారిటీ ఎందుకు తగ్గిందో చెప్పాలని ప్రశ్నించారు.