అందెశ్రీ రాసిన పాటను తాము స్వాగతిస్తామని బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పలు విషయాలపై మాట్లాడారు. అందెశ్రీ రాసిన పాట ప్రజలందరికీ ప్రేరణ కలిగించిందని తెలిపారు. అందెశ్రీ రాసిన పాటను మేం స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటన వచ్చాక రాష్ట్ర చిహ్నంపై స్పందిస్తామని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’కు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ గీతాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. సుమారు 6 నిమిషాల నిడివి కలిగి ఇప్పటికే ప్రాచుర్యం పొందిన గీతాన్ని అలాగే ఉంచి స్వరకల్పన చేస్తున్నారు. దీంతోపాటు అధికారిక కార్యక్రమాల్లో ఆలాపనకు వీలుగా 60 నుంచి 90 సెకన్లకు ఈ గీతాన్ని కుదించనున్నారు.