తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీ ప్రకాశ్ జవదేకర్ నివాసంలో కోర్ కమిటీ సభ్యులు పలుసార్లు సమావేశమై జాబితాపై చర్చించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జీ తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్ సహా పలువురు నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యనేతలు పోటీ చేసే నియోజకవర్గాలు,ఎక్కువమంది టికెట్ ఆశిస్తున్న స్థానాలు, సామాజిక వర్గాల పరంగా… సీట్ల కేటాయింపుపై చర్చించారు.
ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. గురువారం రాత్రి నడ్డా నివాసంలో మరోసారి కోర్ కమిటీ సమావేశంకాగా కేంద్రం హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం తర్వాత తది జాబితాను సిద్ధం చేసి.. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. అందులో చర్చించి ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అభ్యర్థులను ప్రకటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించి 65మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం.