తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటల నుండి ప్రారంభం అయ్యాయి. తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బిజెపి ఎమ్మెల్యేలు ట్రాక్టర్ పై బయలుదేరారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్ అసెంబ్లీకి ట్రాక్టర్ పై బయలుదేరారు. ఇక తొలిరోజు సభ ముగిసిన తర్వాత సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాలలో ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలలో రెండు కొత్త బిల్లులను సర్కార్ ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) బిల్లును ప్రవేశపెట్టనుంది.
తొలిరోజు మధ్యాహ్నం బీఏసీ సమావేశంలో సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనేది క్లారిటీ రానుంది. ఇక రేవంత్ – ఆదానీలు కలిసి ఉన్న ఫోటోలతో టీ షర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు నెంబర్ రెండు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీ షర్టులు వేసుకోవడంపై అధికారులు అభ్యంతరం తెలియజేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.