రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జనజాతర సభపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. తుక్కుగూడ సభ అట్టర్ ఫ్లాప్ అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హామీల పేరుతో మోసం చేయడానికి మళ్లీ రెడీ అయిందని ధ్వజమెత్తారు. ఈ సభా వేదికగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలన్నీ పచ్చి అబద్ధాలు, మోసాలని ఆరోపించారు. పాంచ్ న్యాయ్ పేరుతో ప్రజలకు పంగనామాలు పెట్టేందుకు కాంగ్రెస్ సరికొత్త నాటకానికి తెరలేపిందని దుయ్యబట్టారు.
“రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన గ్యారంటీలనే నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు మళ్లీ గ్యారంటీలంటూ ప్రజలకు నమ్మించేందుకు యత్నిస్తోంది. కుటుంబ పాలనకు, అవినీతి పాలనకు గ్యారెంటీ కాంగ్రెస్. మొత్తానికి తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైంది. రాహుల్ గాంధీ సమక్షంలో ఐదు న్యాయాల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించేందుకు మరోసారి తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కులేదు కానీ ఇప్పుడు మళ్లీ కొత్తగా లోక్సభ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ్ పేరిట ప్రజలకు పంగనామాలు పెట్టేందుకు మరోసారి సిద్ధమయ్యారు.” – లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు