ఓ షాప్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ నటిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను కాపాడారు. బాధితురాలి ఫిర్యాదుతో మాసబ్‌ట్యాంక్ పోలీసులు శనివారం కేసు నమోదు చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫ్లాట్ లోకి చొరబడి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
అసలేం జరిగిందంటే.. ?
బాలీవుడ్/టీవీ నటి ఈనెవ 18న ముంబయి నుంచి హైదరాబాద్ కు ఓ షాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చింది. ఆమె మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్‌కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో బస చేయగా.. ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేసింది. అయితే ఈనెల 21వ తేదీన రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు.. అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి తమతో కలసి వ్యభిచారం చేయాలని నటిపై ఒత్తిడి తెచ్చారు. అదేరోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురుషులు నటి ఫ్లాట్ లోకి చొరబడి తమతో గడపాలని బలవంతం చేయగా.. నటి ప్రతిఘటించింది. ఈ క్రమంలో వారంతా ఆమెపై దాడికి తెగబడగా ఆమె గట్టిగా అరిచారు. దీంతో నటిని గదిలో బంధించి రూ.50వేలతో పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలపగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను కాపాడారు.