హైదరాబాద్ మహానగరంలో సంక్రాంతి పండుగపూట విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ 13 ఏళ్ల బాలుడు శివ ప్రసన్న ఇంటిపై నుంచి పడి మృతి చెందాడు. నాగోల్‌లోని తన ఇంటిపై నుంచి గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే మరణించాడు. ప్రభుత్వ పాఠశాలలో శివప్రసన్న 8వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నాగోల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమారుడు మరణించడంతో పండుగ పూట ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కన్న కొడుకు కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో శనివారం రోజున గాలిపటం ఎగరేసేందుకు తనిష్క్ అనే 11 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో పాటు మేడ పైకి వెళ్లాడు. పతంగి ఎగరేస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయిన తనిష్క్‌ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఘటనలతో పోలీసులు అప్రమత్తమై తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు. పండుగపూట గాలిపటాలు ఎగురవేసే సమయంలో పిల్లలను ఓ కంట కనిపెట్టాలని సూచించారు. ఆరుబయట మైదానాల్లో గాలి పటాలు ఎగురవేయాలని చెప్పారు.