ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజురోజుకూ వీఐపీ భక్తుల సంఖ్య పెరగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయంలో బ్రేక్ దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణమాసం తొలిరోజు (ఆగస్టు 5) అయిన నేటి నుంచే బ్రేక్ దర్శన అమలుకు రంగం సిద్ధం చేశారు. ఈవో కార్యాలయం ముందున్న ప్రస్తుత శీఘ్ర దర్శనం క్యూలైన్‌ను బ్రేక్ దర్శనానికి ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఈ రాజేశ్ తెలిపారు.
మరోవైపు బ్రేక్ దర్శనం కోసం ఒక్కొక్కరికీ రూ.300 టికెట్ అమలు చేయనున్నారు. రోజూ 300 నుంచి 500 మంది వరకు బ్రేక్ దర్శనం చేసుకునే విధంగా ప్రతిరోజు ఉదయం 10.15 నుంచి 11.15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శన సమయాన్ని నిర్దేశించనున్నారు.. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు దేవాదాయశాఖ కమిషనర్ ఆమోదం తెలిపారు.