రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇవాళ్టి నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తొలిరోజైన నేడు.. స్థానిక నేతలు, మహిళా, యువజన సంఘాలు వార్డు కమిటీల సభ్యులతో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సభ్యులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు వంటి అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తారు. మరుసటి రోజు నుంచి తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ, మురుగు గుంతల పూడ్చివేత, తాగునీటి వనరుల శుభ్రత, క్లోరినేషన్, ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తారు. సీజనల్ వ్యాధులపై ప్రచార కార్యక్రమాలు, ప్రభావిత ప్రాంతాల్లో ఇంటెన్సివ్ క్లీనింగ్, యాంటీ లార్వా ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టనున్నారు. ప్రతి ఇంటికి మునగ, కరివేపాకు, వేప, మామిడి, ఉసిరి, నేరేడు, చింత, దానిమ్మ వంటి పళ్లు, ఔషధ గుణాలున్న మొక్కలను పంపిణీ చేస్తారు.