రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు సొంత పార్టీ కార్యకర్తలు భారీ షాక్ ఇచ్చారు. బుధవారం షాబాద్ లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు వెళ్లిన కాలే యాదయ్య వాహనాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆయన వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన ఇటీవల జూన్ నెలలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరికను స్థానిక హస్తం నేతలు అప్పుడే వ్యతిరేకించారు.
గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన కాలె యాదయ్య.. ఇప్పుడు అదే పార్టీలో ఎందుకు చేరారని.. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టించాడని గుర్తు చేశారు. యాదయ్య చేరిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి, ఆ తర్వాత 2018, 23లలో బిఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికలలో 268 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.