పునర్విభజన పేరుతో జిల్లాలను మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎన్నో చర్చలు జరిపిన తర్వాతే జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పేర్ల మార్పుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న లక్షా 90 వేల ఉద్యోగ ఖాళీలను నెల రోజుల్లో గుర్తించి, ఈ ఏడాది చివరిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ సర్కార్‌ను వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
“బీఆర్ఎస్ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రొఫెసర్ కోదండరామ్‌కు బాధ్యతలు పెరిగాయి. నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన పెద్ద బాధ్యత ఇప్పుడు ఆయనపైనే ఉంది. నల్గొండలో బీఆర్ఎస్ సభకు అనుమతి అడిగాం. పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఎలాగైనా నల్గొండలో ఈనెల 13వ తేదీన సభను నిర్వహిస్తాం. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. భారీ జన సమీకరణ జరుగుతోంది.” అని వినోద్ కుమార్ తెలిపారు.