పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదు – కడియం శ్రీహరి

-

పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని హైకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది.

దీంతో అనర్హత వ్యవహారం పై నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని.. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. అనర్హత పిటిషన్ లు స్పీకర్ ముందు ఉంచాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కి ఆదేశాలు జారీచేసింది. లేదంటే తామే ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ తీర్పు పై సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.

హైకోర్టు తీర్పును అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని.. అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తామని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బిఆర్ఎస్ కి లేదని దుయ్యబట్టారు కడియం. రాజకీయాలను ఆ పార్టీ బ్రష్టు పట్టించిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్, సీపీఐ, వైసీపీ, టిడిపి నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని మండిపడ్డారు. అంతేకాకుండా దానికి విలీనం అని కొత్త పేరు పెట్టి నాటకాలు ఆడిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version