రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకూడదన్న లక్ష్యంతో భారత్ రాష్ట్ర సమితి రానున్న సార్వత్రిక ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల రెండో దఫా సమావేశాల్లో భాగంగా బుధవారం రోజున నాగర్‌కర్నూల్ నియోజకవర్గ సమావేశం జరిగింది.
ఇక ఇవాళ మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోని పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పలు కారణాలను సమావేశంలో ప్రస్తావించనున్నారు. పొరపాట్లను సరిదిద్దుకుని మళ్లీ పార్టీని విజయం వైపు నడిపించే కార్యాచరణపై చర్చించనున్నారు. ఓటమిపై అన్ని స్థాయిల్లో ఆత్మపరిశీలన చేసుకుని లోక్సభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు లోక్ సభ ఎన్నికల వేళ ఎమ్మెల్సీ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం వారికి బాధ్యతలు అప్పగించనుంది. ఈ మేరకు పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు ఇవాళ సమావేశం కానున్నారు.