తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హమీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ సర్కార్ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గ్యారెంటీ అమలుపై కసరత్తు షురూ చేసింది. ఎన్నికల్లో చెప్పినట్లు ప్రతి నెలా 200 యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.
ఉచిత కరెంట్ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలపై విద్యుత్తు పంపిణీ సంస్థలను ఆరా తీసింది. ఈనెల ఒకటో తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గృహావసర విద్యుత్తు కనెక్షన్లు కోటీ 31 లక్షల 48 వేలకు పైగా ఉందని తేలినట్లు సమాచారం. వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు వాడేవి కోటీ 5 లక్షల వరకు ఉన్నాయని విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. ఈ కనెక్షన్ల నుంచి నెలనెలా కరెంటు బిల్లులపై డిస్కంలకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తోందని.. ఈ కోటీ 5 లక్షల ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.