తెలంగాణను పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని సందర్భం వచ్చిన ప్రతిసారి గులాబీ నేతలు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు పక్షాన తరచూ గొంతు వినిపిస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ పకడ్బందీగా ప్రణాళికలు వేస్తోంది.
ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన రాష్ట్ర రాజకీయాలపైన ఓ కన్నేసి ఉంచారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన పునరుద్ఘాటించారు. ఈసారి సింగిల్ గా అధికారంలో వస్తామని జోస్యం చెప్పారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వచ్చినట్టే.. సిరిసంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్న ఆయన.. ఇప్పుడు రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు.