పార్టీ ఫిరాయింపుల అంశాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే తమ పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించేలా శాసనసభాపతికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ పై అనర్హతా వేటు వేయాలని పిటిషన్‌లో కోరింది.
సభాపతి ప్రసాద్ కుమార్‌కు సైతం ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్ధిగా కూడా నాగేందర్ పేరును ప్రకటించారని పేర్కొంది. సభాపతి ఇంకా స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. త్వరగా చర్యలు తీసుకోవాలని సభాపతిని ఆదేశించాలని కోర్టును కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
లోక్సభ ఎన్నికల ముందు వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.