మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలతో రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ అధ్యయన కమిటీ వేసింది. రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నది ఈ కమిటీ. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, దుర్భర వ్యవసాయరంగ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. రెండు వారాల అధ్యయనం తర్వాత నివేదిక రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి, వ్యవసాయ కమిషన్కు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి నివేదిక అందజేయనుంది.
రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ సభ్యులుగా ఉన్నారు.