గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని అన్నారు బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సోమవారం నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు జగదీశ్ రెడ్డి.
ప్రజాస్వామ్యం పై నమ్మకం పెరిగేలా హైకోర్టు తీర్పు ఉందన్నారు. ప్రజా కోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే మరొక అవకాశం ఉప ఎన్నికల రూపంలో ప్రజలకు వస్తుందన్నారు. అప్పుడు ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.