సాధారణంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ చిన్న చిన్న వస్తువులను ఢ్యామేజ్ చేయడం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కార్ల అద్దాలు ధ్వంసం, కారుకు గీతలు పడటం.. పలు వాహనాలను కింద పడేయడం ఇలాంటివి తెలిసి, తెలియని వయస్సు లో చాలా మంది పిల్లలు చిలిపి చేష్టలు చేస్తుంటారు. అయితే తాజాగా వరంగల్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కారు పై గీతలు గీశారని 8 మంది స్కూల్ పిల్లలపై ఓ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
FIR నమోదు అయిన వారిలో 3వ తరగతి నుంచి 10వతరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులున్నారు. కారు పై గీతలు గీశారని చిన్న పిల్లలపై కేసు నమోదు చేసినందుకు పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. హనుమకొండ రాంనగర్ టవర్స్ లో నివాసం ఉండే రాజు సీఐడీ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంటాడు. జులై 27 తన కారుపై పిల్లలు గీతలు గీశారు. 8 మంది పిల్లలు తన కూతురును తిడుతూ గీతలు గీయడం, రాతలు రాయడం చేశారని.. వాటిని తుడిచివేయాలంటే దాదాపు రూ.1.80 లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు. ఆగస్టు 05న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు కానిస్టేబుల్ రాజు నిత్యం బెదిరిస్తున్నాడని పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.