కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పార్లమెంట్ లో భద్రతపై ప్రశ్నిస్తే.. ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీ సిఫారసు వల్లే నిందితులకు పాస్ లు వచ్చాయని.. వారిని కాపాడేందుకు ఘటన జరిగి వారం రోజులు అయినా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ భద్రత అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తి వేయాలన్నారు.
ప్రభుత్వం మారిందని.. బీఆర్ఎస్ నేతలు గ్రహించాలన్నారు. గతంలో బంగారు పాలన అందించామని.. బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బంగారు పాలన అందిస్తే.. ప్రజా వాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కచ్చితంగా నెరవేరుస్తుంది. అందులో సందేహించాల్సిన అవసరమే లేదు అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.