తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్లలో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని .. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని కోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చేపట్టే ట్యాపింగ్‌కు తమ అనుమతి అవసరం లేదని వెల్లడించింది.
ప్రముఖులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం రోజున మళ్లీ ఓసారి విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందని ఈ కౌంటర్లో సొలిసిటర పేర్కొన్నారు. ఆ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని.. ట్యాపింగ్‌కు అనుమతిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపారు.