తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్లు పొంది కళాశాలల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో మరో బ్రాంచికి మారే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీన్నే అంతర్గత స్లైడింగ్ అంటారు. అయితే ఈ ఇంట్రనల్ స్లైడింగ్ ఇవాళ్టి (బుధవారం ఆగస్టు 21వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ప్రభుత్వమే స్లైడింగ్ చేపడుతుండటం గమనార్హం. దీనితో బ్రాంచి మారినా బోధనా రుసుములు పొందేందుకు అర్హులే.
ఖాళీల సీట్ల తుది జాబితా బుధవారం ఉదయం 11.30 గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఇంజినీరింగ్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 24వ తేదీన సీట్లు కేటాయిస్తామని చెప్పారు. సీట్లు పొందిన వారు కొత్త బ్రాంచీల్లో ఈనెల 25వ తేదీలోగా చేరాలని ఇంజినీరింగ్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన సూచనలు జారీ చేశారు.