అస్తమా, శ్వాసకోశ సమస్యలున్న రోగులు ఎప్పుడెప్పుడా అని చూసే చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. మృగశిరకార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత బత్తిని కుటుంబం మళ్లీ ఈ సంవత్సరం ప్రసాదం పంపిణీ చేస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కలెక్టర్ అమోయ్‌కుమార్‌ల పర్యవేక్షణలో బత్తిని హరినాథ్‌గౌడ్ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలు ముమ్మర ఏర్పాట్లు చేశాయి.
రెండు రోజులపాటు 5లక్షల మందికి సరిపోయేలా 5 క్వింటాళ్ల చేప ప్రసాదం తయారు చేస్తున్నారు. మత్స్యశాఖ ఇప్పటికే 2.5 లక్షల కొర్రమీను చేపపిల్లలను సిద్ధం చేసింది. శాకాహారులకు బెల్లంతో ప్రసాదం ఇస్తారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు ఎవరైనా వేసుకోవచ్చని, గర్భిణులు మాత్రం తీసుకోవద్దని హరినాథ్‌గౌడ్ కుమార్తె అలకనందాదేవి సూచించారు. పరగడుపున లేదా భోజనం తీసుకున్న మూడు గంటల తర్వాత తీసుకోవాలన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు, సరిపడా శౌచాలయాలను ఏర్పాటు చేశారు.