బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలి తుంటి ఎముక విరగడంతో హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయణ్ను పరామర్శించడానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నూతన మంత్రులు కేసీఆర్ను పరామర్శించారు.
మరోవైపు తాజాగా కేసీఆర్ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వెలుపల చిరంజీవి మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. కేసీఆర్ 6 వారాల్లో కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారని చెప్పారు సర్జరీ తరువాత 24 గంటల్లోనే ఆయనను నడిపించారని చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనూ కేసీఆర్.. సినిమాలు ఎలా ఆడుతున్నాయి? సినీ పరిశ్రమ ఎలా ఉంది? అని అడగడం చాలా సంతోషంగా అనిపించింది అని చిరంజీవి తెలిపారు.