ప్రభుత్వ స్కూళ్లలో దసరా నాటికి ప్రారంభించాల్సిన సీఎం అల్పాహార పథకాన్ని ఈనెల 6న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఉండటంతో 6 నుంచి జిల్లాకు ఒక స్కూలులో పథకం అమలు చేసి పరిశీలించనుంది.
అక్టోబర్ 26న స్కూల్లు పునః ప్రారంభం కానుండగా… లోపాలను సరిచేసి అన్ని పాఠశాలలకు విస్తరించాలని భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ స్కూళ్లు 642, మోడల్ స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకు పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన విద్యను అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… మానవీయ కోణంలో పోషకాహారాన్ని అందించేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఉదయాన్నే విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలన్న సంకల్పంతో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నది. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచడం, కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నది.