ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో సీఎం హోదా లో తొలిసారిగా అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని మోగించేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ గిరిజన దేవాలయమైన నాగోబా ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. దీంతో అక్కడ అంతా సందడి వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఆలయ సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి కి సాంప్రదాయ గిరిజన తలపాగా కట్టారు. అనంతరం నాగోబా దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేస్లాపూర్ లోని నాగోబా దర్బార్లు స్వయం సహాయక సంఘాలతో సీఎం సమావేశం నిర్వహించారు. మరోవైపు నాగోబా గుడి గోపురాన్ని సీఎం ప్రారంభించి.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలి అనేది తమ ఉద్దేశమని సీఎం తెలిపారు. త్వరలోనే మహిళలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని.. సామాన్యులపై భారం పడకుండా అతి త్వరలోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు.