రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలిచేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత తాజాగా 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 95-105 స్థానాల్లో విజయం సాధిస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్‌లో అక్టోబరు 16న నిర్వహించనున్న సింహగర్జన సభలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉజ్వలమైన, ఉత్కృష్టమైన, అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని అన్నారు. ప్రగతి ఎజెండాతో ముందుకుపోతున్నామని.. దీన్ని కొనసాగించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులను స్వీకరించి, వారికి అద్భుత విజయం చేకూర్చాలని ప్రజలను కోరుతున్నానని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఒక్క అవకాశమివ్వాలని కోరుతోందని, ఇంకా ఎన్నేళ్లు అవకాశమిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛను ఇచ్చినోళ్లు.. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా?అని సీఎం ఎద్దేవా చేశారు.