బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలతో సుడిగాలి పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ సభల్లో కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు తొమ్మిదన్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి చేసిన సేవలు, అభివృద్ధిని వివరిస్తున్నారు. పార్టీలు, అభ్యర్థుల చరిత్ర తెలుసుకుని ఓటు వేయాలని… అప్పుడే నాయకులు కాకుండా ప్రజలు గెలుస్తారని కేసీఆర్ ప్రతి సభలో పునరుద్ఘాటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తమ పార్టీకి… రాష్ట్ర ప్రజలే బాసులని దిల్లీలో బాసులు ఉండరని స్పష్టం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈరోజు కూడా మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. నేడు కాగజ్‌నర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రసంగిస్తారు. కాగజ్‌నగర్‌లోని ఎస్‌పీఎం క్రీడా మైదానంలో సభకు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆసిఫాబాద్‌లోని ప్రేమలా గార్డెన్ సమీపంలో.. బెల్లంపల్లిలోని తిలక్ స్డేడియంలో ప్రజా ఆశీర్వాద సభకు స్థానిక నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభలకు భారీ ఎత్తున జనసమీకరణ కూడా చేసినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.