ఉమ్మడి పాలమూరు ప్రజల చిరకాల కోరిక ఇవాళ నెరవేరబోతోంది. పాలమూరు ప్రజల కాళ్లు ఇవాళ కృష్ణమ్మ నీటితో తడవబోతున్నాయి. ఆ జిల్లా ప్రజల గొంతును కృష్ణమ్మ నేడు తడపబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుతఘట్టం ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ ప్రారంభం కానుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించనున్నారు. నార్లాపూర్‌లో తొలి పంపు స్విఛ్ ఆన్ చేయనున్నారు. పాలమూరు-రంగారెడ్డి పైలాన్ ఆవిష్కరించనున్నారు. డెలివరి సిస్టర్న్ వద్ద సీఎం ప్రత్యేక పూజలు చేసి గంగాహారతి ఇవ్వనున్నారు. కలశాల్లో కృష్ణా జలాలు గ్రామాలకు చేరవేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం కొల్లాపూర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం సభకు భారీ జనసమీకరణలో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న క్రమంలో జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల్లో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన ఉద్దేశంతో… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2016లో పనులు ప్రారంభించి.. ఇప్పటివరకు 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.