నేడు రంగారెడ్డిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాలయ సముదాయాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరాకలాన్‌లో 44 ఎకరాల విస్తీర్ణంలో 58 కోట్లతో భవనం నిర్మించారు.

ప్రభుత్వ కార్యకలాపాలు, వివిధ శాఖల నిర్వహణ కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 42 గదులు, మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 34 గదులు నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఏవో, డీఆర్వో ఛాంబర్లు, రెవెన్యూ విభాగం సహా రెండు సమావేశ మందిరాలు, వివిధ శాఖలు ఉంటాయి. మొదటి, రెండో అంతస్తుల్లోని గదులను ఇతర ప్రభుత్వ శాఖలకు కేటాయించారు.

సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కలెక్టరేట్‌ ప్రారంభించిన అనంతరం సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు.